ఎవరు గొప్ప? సత్యసాయా? సత్తెమ్మ తల్లా..?
సత్యసాయి.. స్వయంగా షిర్డీ సాయి అవతారమని చాటుకున్నారు. మూడు అవతరాల్లో సత్యసాయిది రెండో అవతారమన్నారు. 96 ఏళ్లు బతుకుతామన్నారు. కానీ, 85 ఏళ్లకే ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం సత్తెమ్మతల్లే అన్నది భక్తుల అనుమానం. ఇంతకీ.. బాబా శక్తి ఎక్కువా..?.. సత్తెమ్మ తల్లి శక్తి ఎక్కువా?
సత్తెమ్మ తల్లి.. సత్యసాయి కొలువైన పుట్టపర్తి గ్రామ దేవత. తరతరాలుగా పూజలందుకుంటూ.. ప్రజలను కాపాడుతున్న దైవం. ఈ సత్తెమ్మ విగ్రహం కొన్నాళ్ల క్రితం పాక్షికంగా దెబ్బతింది. చేయి విరిగిపోవడంతో, పూజకు అర్హత కోల్పోయిందని భావించిన గ్రామస్తులు, సమీపంలోని బుక్కపట్నం చెరువులో నిమజ్జనం చేశారు. ఆలయంలో కొత్త విగ్రహాన్ని బాబా సోదరుడి కుమారుడు, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ ప్రతిష్టించారు. ఇది జరిగి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఆ తర్వాతే నవంబర్‌లో బాబా జన్మదిన వేడుకలు జరిగాయి. అనంతరం బాబా ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ప్రతీసారి వేడుకల్లో ప్రసంగించే బాబా, అప్పుడు కేవలం దర్శనం మాత్రమే ఇచ్చారు. ప్రశాంతి నిలయంలోనూ బాబా దర్శనం నిలిచిపోయింది. చివరకు మార్చి 28న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సత్యసాయిని అడ్మిట్ చేశారు. బాబా అనారోగ్యం పాలవడంతో భక్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. సోమవారం రాత్రి పూనకం తెచ్చుకున్న ఓ బాబా భక్తురాలు, సత్తెమ్మ త్లలి ఆగ్రహం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రకటించడం సంచలనం సృష్టించింది. చెరువులో నిమజ్జనం విగ్రహాన్ని తిరిగి ఆలయంలో ప్రతిష్టిస్తేనే బాబా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంతో, గ్రామస్తులు రాత్రికి రాత్రే గాలింపు మొదలుపెట్టారు. అయితే.. ఉదయం వరకూ విగ్రహం దొరకలేదు. పూనకం వచ్చిన చూపించిన ప్రాంతంలో మంగళవారం ఉదయం విగ్రహం దొరికింది. సత్తెమ్మ తల్లి దొరకడంతో గ్రామస్తుల్లో ఉత్సాహాం వచ్చింది. విగ్రహాన్ని ఊరేగింపుగా పట్టణంలోకి తీసుకువచ్చారు. విగ్రహం దొరికిన కాసేపటికే, బాబా ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు హాస్పిటల్ డైరెక్టర్ ప్రకటించడం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. అంతా సత్తెమ్మ మహిమే అంటున్నారు భక్తులు. అంటే.. సాయి శక్తులు సత్తెమ్మ తల్లి ముందు నిలవలేదన్నమాట. అసలు బాబాకు మానవాతీత శక్తులున్నాయా? 96 ఏళ్లపాటు ఈ అవతారంలోనే ఉంటానన్న సత్యసాయి, 85 ఏళ్లకే ఇలాంటి విషమ పరిస్థితిలో ఎలా చిక్కుకున్నారు. పైగా, ఎంతోమంది రోగాలను బాబా చేతిస్పర్శతోనే నయం చేశారని భక్తులు చెబుతుంటారు. అలాంటిది, తన ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు..? బాబా అంటే అభిమానం ఉండొచ్చు.. కానీ, ఆయన కూడా అందరిలాంటి మనిషే అని, మానవాతీత శక్తులు ఆయనకు లేవని ఈ ఉదంతం తేల్చి పడేస్తుంది. ఒకవేళ సత్తెమ్మ తల్లే గొప్ప అనుకుంటే.. ఇక బాబాకు పూజలు మాని ఆమెకు చేస్తేనే మేలనుకుంటా..
No comments:
Post a Comment