Wednesday, March 9, 2011

పంటల దేవుడు....


పంటల దేవుడు....
అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉండే దేవుడిగా ఉన్న వినాయకుడు మరి బేసిగ్గా ఏనుగు ఆకారంలో ఎందుకు ఉన్నాడు? పార్వతి నలుగుపిండిని కలిపి వినాయకుణ్ణి చేస్తే.. శివుడు ఆయన తల నరికి ఏనుగు ముఖం పెట్టాడన్న కథ పురాణాల్లో ఉంటే ఉండవచ్చు. వ్రతాల్లోనూ మనం చెప్పుకుంటున్నాం... కానీ.. ఇదేనా నిజం? వినాయకుడి రూపంలో మరేదైనా మతలబు ఉందా? విఘ్నేశ్వరుడి రూపం వెనుక రహస్యం ఏమిటి?
విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, గణనాధుడు.. రకరకాల పేర్లతో ఆ దేవదేవుణ్ణి మనం కొలుస్తున్నాం... ఏ పనిని మొదలు పెట్టినా విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ గణపతిని పూజిస్తాం... మిగతా దేవుళ్లంతా చక్కని ముఖాలతో.. అందంగా, మంచి మంచి వాహనాలెక్కి వెళు్తంటారే... మరి వినాయకుడేమిటి? ఏనుగు ముఖం.. ఎలుక వాహనం.. ఎక్కడైనా పొంతన ఉందా? ఏనుగు ఎలుక మీద ఎక్కి కూర్చొని వెళ్లటం విచిత్రం కాదా? ఏ విధంగా చూసినా సైన్‌‌సకు కూడా అందని విధంగా ఈ ఆకారం , వాహనం ఉండటం అసంభవం కాదా? ఒక్కసారైనా ఆలోచించారా ఇదేమి వింత అని... మనలో చాలామందికి ఆలోచించటం పెద్ద పని... ఇవాళ మనం పూజిస్తున్న ఒక్కో దేవుడి గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే... ఆ దేవీదేవతల రూప రహస్యాలు శాస్త్ర సాంకేతికతకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుంది...
వినాయకుడు కూడా అంతే....
వినాయక చవితిని మనం భాద్రపద మాసంలో జరుపుకుంటాం...అంటే వ్యవసాయ తొలి సీజన్‌ ఖరీఫ్‌ మంచి ఊపు అందుకునే సమయం... మన దేశం నూటికి నూరు శాతం వ్యవసాయ ప్రధాన దేశం అన్నది గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతీ పనిలోనూ ఏదో రకంగా వ్యవసాయ సంబంధ అంశాలు చోటు చేసుకోవటం గమనిస్తే అర్థమవుతుంది. వినాయక చవితి కూడా అంతే.. ఇప్పుడంటే ఆలస్యంగా వర్షాలు పడ్డాయి కానీ, సాధారణంగా నాట్లు వేయటంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయం. అందుకే ఆయనకు తొలి పూజలను చేసి పవిత్రమైన వ్యవసాయ పనులను రైతులు మొదలుపెడతారు. ఆయన శరీరం ఏనుగు శరీరం.. అంటే భారీ పదార్థం... సైన్‌‌స పరిభాషలో మెటీరియల్‌... పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది. మట్టి నుంచే పంట పండుతుంది. అంటే ఆయన స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి సింబల్‌. ఆయనకు ఉండే ఏక దంతం రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను అణచివేయటానికి గుర్తు. పొట్టపై పాముల్ని బిగించి కట్టుకోవటం కూడా అందుకే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు మనం 21 రకాల పత్రాలను వినియోగిస్తాం. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడు. వినాయకుడిని పూజించటం అంటే మనకు అన్నం పెట్టే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే... 
పూర్ణ సృష్టికి సంకేతం గణపతి!
గణపతి ఓంకార స్వరూపం. బృహస్పతి, బ్రహ్మణస్పతి కూడా గణపతియేనని వేదాలు చెప్తున్నాయి. ఆయనే పరతత్వం. గాణాపత్య మార్గంలో గణపతిని పరబ్రహ్మస్వరూపంగా భావించి పూజిస్తారు. జానపదులు పంటల దేవుడిగా పూజిస్తారు. ఖగోళ శాస్త్రంలో కూడా గణపతిని గూర్చిన ప్రస్తావన ఉంది. గణపతి తత్తా్వన్ని గురించి ఎన్ని రకాలుగా విశ్లేషించినా సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టసాధ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంపూర్ణమైన సృష్టికి ప్రతిబింబం. ఆయన జీవుడికి, దేహాత్మ భావనకు ప్రతీక. ఎందుకంటే గణపతి మూలాధారంలో ఉంటాడు. సమస్త శరీర భారాన్ని మోసేది మూలాధారం. సమస్త జీవకోటికి ఆధారభూతమైనది భూమి. గణపతి ఈ పృథ్వీతత్తా్వనికి ప్రతీక. కాబట్టే గణపతి స్వరూపం మనకు స్థూలంగా కనిపిస్తుంది. పదార్థం.(material) ఎప్పుడూ స్థూలంగానే ఉంటుంది. అందుకే గణపతి శరీరం భారీగా ఉంటుంది. పెద్ద జంతువు ముఖం, బానపొట్ట, భారీ కాయం.. వెరసి గణపతి స్వరూపం. అనంతమైన శూన్యం నుంచి మొదట పదార్థం ఉద్భవించింది. దాని నుంచి ప్రకృతి ఆవిర్భవించింది. ఆ ప్రకృతికి ప్రాణశక్తి లభించింది, దాని నుంచి జలచర, భూచరాదులతో కూడిన జీవజాలం పుట్టాయి. ఆ తరువాత మనస్సు కలిగిన మనిషి పుట్టడం. ఈ పరిణామక్రమానికంతటికీ గణపతి ప్రతిరూపంగా కనిపిస్తాడు. స్థూలకాయం పదార్థమైతే, గజముఖం విశ్వంలోని జీవజాలానికి చిహ్నం. అందుకే గణపతికి జంతువులలో అతి పెద్దదైన ఏనుగు ముఖం ఉంటుంది. ఆయన గజముఖుడయ్యాడు. దానితో పాటే మానవ శరీరాన్నీ గణపతి కలిగి ఉన్నాడు. ప్రకృతితో మమేకం అయ్యాడు కాబట్టి ఆయనను ప్రకృతిలోని సమస్తమైన పత్రాలతో, పూవులతో పూజిస్తారు. ఇంతటి మూర్తిమంతమైన శక్తికి దివ్యచైతన్యవంతం కావడం దైవత్వాన్ని సిద్ధించుకోవడం భారతీయ సంస్కృతిలోని ఒక విశేషమైన సంప్రదాయానికి, అపురూపమైన ఆధ్యాత్మిక భావ సంపదకు సంకేతం. ప్రతి మనిషి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. ఇది అంతా అంగీకరించవలసిందే. పుట్టడం కష్టసుఖాలను అనుభవించడం నిర్లిప్తంగా లోకం నుంచి నిష్క్రమించడం జన్మ వృథా చేసుకోవడమే. ప్రపంచంలోని సమస్త జీవజాలంలో మనిషి మాత్రమే దివ్యచైతన్యాన్ని సాధించే దిశగా ఎదిగే సమర్థుడు. మానవుడు మానవుడిగా మాత్రమే కాక, దైవత్వాన్ని సాధించడం లక్ష్యంగా జీవించాలని గణపతి సూచిస్తున్నాడు.
ఇదే లక్షణాన్ని సమన్వయ పరుస్తూ గజాసుర వృత్తాంతం కూడా మన పురాణాల్లో ఉంది. గజాసుర సంహారార్థం పరమ శివుడు కైలాసం నుంచి తరలి వెళ్లిన సమయంలో పార్వతీ దేవి నలుగుపిండితో బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసిందిట. గజాసురుని వధించిన తరువాత తిరిగి వచ్చిన స్వామి, బాలకుడితో తగవుపడి అతడి శిరసును ఖండించగా, గజ ముఖాన్ని తీసుకువచ్చి తగిలించి పునఃప్రాణం పోశాడట. ఇందులోనూ పార్వతీపరమేశ్వరులు ప్రకృతి పురుషులు కాగా, నలుగుపిండి పదార్థానికి, గజముఖం జీవశక్తికి సంకేత రూపాలు. 
సృష్టి ప్రారంభస్థానమైన మూలాధారానికి అధిపతి కావడం వల్లనే గణపతి తొలిపూజలందుకుంటున్నాడు. పృథ్విని ఆశ్రయించుకుని ఉండే పంచభూతాల నుంచి కలిగే విఘ్నాలను తొలగించే వాడు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడయ్యాడు. అంతే కాదు, సంపూర్ణమైన కుండలినీ శక్తికి గణపతి ప్రతీక. కుండలినీ శక్తి మూలాధారం నుంచి ప్రారంభమై సహస్రారం దాకా పైపైకి ఎదుగుతూ వస్తుంటుంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయకుడు ఈ కుండలినికి చిహ్నం. ఆయన నీటిలోంచి క్రమంగా కొద్ది కొద్దిగా పైకి ఎదుగుతూ వస్తుండటం ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.
మనకు కలిగే ఆటంకాలను తొలగించే వాడు కాబట్టి ఆయనను సకల విఘ్న హరుడని కొలుస్తున్నాం. అయితే, ఆయన విఘ్నాలను తొలగించడమే కాదు.. విఘ్నాలను కల్పించేవాడని కూడా పౌరాణికులు చెప్తారు. మోక్షమార్గం వెళ్లాల్సిన జీవులు అపమార్గం పట్టకుండా ఉండేందుకు తానే అడ్డంకులను కల్పించి, ఆ జీవులను సక్రమమార్గంలో పెడతాడు కాబట్టి ఆయన విఘ్న హరుడు కాకుండా, విఘ్నాలకు అధిపతిగా పూజిస్తారు. అన్ని కాలాల్లో, అన్ని రుతువుల్లో, అన్ని పర్వదినాల్లో, సింహభాగం గణపతికే దక్కేది. శరీరానికి ఆధారభూతుడైన వాడు కాబట్టే ఆయనకు ఆ అగ్రతాంబూలం. 
*****************************************************ఆనందిని బ్లాగు

No comments:

Post a Comment