సంక్రాంతి అంటే మార్పు...మారడం,చేరడం అనే అర్ధాలు ఉన్నాయి.రవి సంక్రమణం రోజున స్నానం చేయ్యని నరుడు ఏడు జన్మలదాకా రోగి,నిర్ధనుడు అవుతాడు.కనుక సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి ,పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి.కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేస్తారు.శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది.ఈ సంక్రమణకాలంలో ధాన్యం,ఫలాలు,విసనకర్ర , వస్త్రం, గుమ్మడి, సువర్ణం, కాయగూరలు, దుంపలు,తిలలు,చెఱకు,గోవు మొదలైనవి దానం చేయాలి.ఈ రోజున వస్త్రదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం అనే పంచ ఋణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.
దేవఋణం
ఇంద్ర,వరుణ,వాయు దేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించుట వల్లనే మకర సంక్రాంతి పండగ నాటికి పంటలు సమృద్ధిగా పండి,రైతు చేతికి అందుతాయి.తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది.అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి,సూర్యాది దేవతలను పూజించి,కొత్త బియ్యంతో పొంగలి,పులగం తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం మన ఆచారం.
పితృఋణం
పితృ తర్పణాలు ,పిండోదక దానాలు,శ్రాద్ధకర్మలు మొదలగునవి ఆచరించడం ద్వారా , మరణించిన పితృల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు.మకర సంక్రాంతినాడు తెలక పిండి(నువ్వులపిండి) ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఒక ఆచారం.ఎందుకంటే మకర రాశికి శని అధిపతి.శని వాత ప్రథాన గ్రహమంటారు.వాతం తగ్గాలంటే ఈరోజు తెలకపిండితో స్నానం చేసి,నువ్వులు,బెల్లం,గుమ్మడికాయ మొదలైనవి దానాలు ఇవ్వడమే దీనికి పరిహారం.కాబట్టే నువ్వులు, బియ్యంపిండి, బెల్లంతో చేసిన అరిసెలను అంతా కూడా తింటుంటారు.
భూతఋణం
నీరు,భూమి,గాలి,ఆకాశం,అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి.అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం.పండిన పొలాల్లో పొంగలి మెతుకులు ,పసుపుకుంకాలు చల్లి ఎర్ర గుమ్మడి కాయను పగులకొట్టి దిష్ఠి తీయడం ఆచారమైంది.పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి.ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి.కాబట్టే కృతజ్ఞాతాసూచకంగా 'కనుమ' నాడు పశువులను, పశుశాలను శుభ్రం చేసి అలంకరిస్తారు.వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు.ఇళ్ళ ముంగిట బియ్యం పిండితో రంగవల్లులు వేస్తారు.ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహరం.ఇలా మూగ జీవులకు ,భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాన్ని ఈ పండుగ నిర్దేశించింది.
మనుష్యఋణం
ఇతరుల సహాయసహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం.అందుకు కృతజ్ఞతగా ఈ పండుగనాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, ఫలాలు, వస్త్రాలు, బంగారం వంటివి విరివిగా దానధర్మాలు చేస్తారు.అతిథులను ఆదరిస్తారు.వ్యవసాయంలో సహాయం చేసినవారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ
కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా సంక్రాంతిలో మరొక ఆచారం.
ఋషిఋణం
సంక్రాంతి సాధనలు, సత్ గ్రంధ పఠనాదులూ శిఘ్రఫలాలనిస్తాయని విశ్వసిస్తారు.వీటిని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుందని భావిస్తారు.
No comments:
Post a Comment