Monday, May 2, 2011

హనుమాన్ జయంతి


హనుమాన్  




హనుమాన్ జయంతి 
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
హిందూమతంలో ప్రాముఖత
పర్వతమును తీసికొని వస్తున్న హనుమంతుడు. టెర్రాకొట్టా శిల్పం.హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రంలో చెప్పబడిన నామాలు హిందూ విశ్వాసాలలో హనుమంతుని పాత్రను సూచిస్తాయి.
హనుమానంజనాసూనుః వాయుపుత్రోమహాబలః 
రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షోః అమిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః 
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా 
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ 
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది.
యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్ 
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్ 
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలిజోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను.
ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడిన వర్ణనలు: రామాయణ మహామాలా రత్నము, జితేంద్రియుడు, శ్రీరామదూత, జానకీశోక నాశకుడు, జ్ఞానగుణ సాగరుడు, హనుమాన గోసాయి, సంకట హారి, మంగళమూర్తి. హనుమంతుని స్మరించినయెడల సీతారాములు ప్రసన్నులగుదురు. హనుమంతుని పేరు వినబడినచోట దయ్యములు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యములు సిద్ధించును. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థింపవచ్చును. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికల కొరకు శ్రీరాముని నేరుగా భజింపవలదు
Add caption
జననం, బాల్యం 
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
విద్యాభ్యాసం
హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కింధలో ఉన్న వానరులు.
కిష్కింధ కాండ
వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకొనెను. రావణాసురుడు అపహరించిన సీతను వెదకుచు రామ లక్ష్మణులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకొని, వారిని తన భుజములపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసికొని వెళ్ళి వారికి మైత్రి కూర్చెను.
రాముని చేత వాలి హతుడవ గా సుగ్రీవుడు వానర రాజయ్యెను. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదెసలకు వానర వీరులను పంపెను. అలా వెళ్లినవారిలో, దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు.
వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. ఆ తరువాత ఏమి చేయాలో పాలుపోక హతాశులై ఉన్న వారికి సంపాతి అనే గృధ్రరాజు (జటాయువు అన్న) సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తతింది. చివరకు జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడనీ చెప్పాడు. ఆ ఆపదనుండి అందరినీ కాపాడడానికి హనుమంతునకే సాధ్యమని చెప్పాడు.
హనుమంతుడు పర్వకాల సముద్రం లా పొంగిపోయాడు. వంద ఆమడల వారాశి ని గోష్పదంలా దాటేస్తాననీ, సీతను చూచి వస్తాననీ అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.
సుందర కాండ
ప్రధాన వ్యాసం: సుందరకాండ 
రామగానము చేస్తున్న హనుమంతుడు. పెయింటింగ్హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం చాలామందిలో ఉంది. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.
ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండ
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.
శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.
రావణుని శక్తితో మూర్ఛిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసికొని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల చాలా మంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకు రమ్మని హనుమను కోరాడు.
జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, మిగిలిన వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.
తరువాతి యుద్ధంలో లక్ష్మణుని చేతి లో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్న ఓషధుల పర్వతం సంజీవని ని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.
ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.
శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు.
శ్రీ రామ నవమి
శ్రీ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలలో శ్రీరామావతారం ఏడవది.
శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.
అందుచేత ప్రతీ సంవత్సరం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. ఆంధ్రదేశంలో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తోంది.
రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని సంహరించడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు.
ఒక రోజు పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేసాడు.
శ్లో శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మానవులకు 'రామనామ స్మరణ' జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. 'రామ' యనగా రమించుట అని అర్ధం.
శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.
భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.
రామ సంబంధమైన పండుగలు ఏడాదిలో శ్రీరామనవమి కాక మరి రెండు ఉన్నాయి.
1. రామలక్ష్మణ ద్వాదశి: ఇది జ్యేష్ఠ శుద్ద ద్వాదశి నాడు జరుపుకుంటాం.
2. జానకీ జయంతి: ఇది ఫాల్గుణ శుద్ద అష్టమి నాడు జరుపుకుంటాం. జనకమహారాజు యజ్ఞశాలకై భూమిని దున్నుతూ ఉండగా నాగటి చాలులో తగిలిన బంగారు పెట్టెలో ఈ నాడు సీత దొరికింది. అందుచేత ఈనాడు సీతాజయంతిగా జరుపుకుంటాము.
*****************************************************************************
శ్లో శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే
********************************************************************
అదౌరామ తపోవనాది గమనం హత్వామృగం కాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం త్యేతద్ది రామాయణమ్‌ (ఏక శ్లోకి రామాయణం)
*******************************************************************
దురమున దాటకం దునిమి, ధూర్జటివిల్‌ దునుమాడిసీతనున్‌
బరిణయమంది తండ్రిపనుపన్‌ ఘనకాననభూమికేగి దు
స్తరపటుచండకాండకులిశాహతి రావణ కుంభకర్ణ భూ
ధరములఁ గూల్చిన తీవెకద, దాశరథీ కరుణాపయోనిధీ
తా: ఓ రామా! తాటకిని చంపి, శివధనస్సును విరిచి సీతను పెండ్లాడి తండ్రి అనుమతి పై వనవాసము చేసి చంఢ ప్రచండ భీకరబాణములచే రావణ కుంభకర్ణాదులను వధించినవాడవునీవేగదా! నీ రామావతారము కడు ప్రశంశనీయమైనది. అవతారాలన్నింటిలో అత్యున్నతమైన అవతారం రామావతారం కదా! శ్రీ రామ!
***********************************************************************
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను? గెల్చెఁబో నిజం
బాతని మేన శీతకరుఁడౌట దవానలుఁ డెట్టివింత, మా
సీత పతివ్రతామహిమ, సేవక భాగ్యము, మీ కటాక్షమున్‌
ధాతకు శక్యమా పొగడ, దాశరథీ కరుణాపయోనిధీ
తా ఓ రామా! సీతాదేవి యొక్క పాతివ్రత్యమహిమను, నీ సేవాభాగ్యమహిమను, నీ దయాగుణమును లెక్కించుటకు బ్రహ్మకు గూడా సాధ్యముకాదుకదా! నీ మహిమ వలననే కదా వానరులు, అసురులను గెలువగలిగిరి. గెల్చినను హనుమంతుని తోకను అగ్నిదహింపకుండుట సీతాదేవి పాతివ్రత్య మహిమకాక మరేమిటి? అభిరామా! నీ మహిమలన్నియు అద్భుతములేగదా!
********************************************************************
హనుమాన్ చాలీసా 
ప్రార్ధన

శ్రీ గురుచరణ సరోజరజ
నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ
జో దాయక ఫల చారీ
తా. శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే నా మనస్సునే అద్దమును శుబ్రము చేసుకుని ధర్మార్ధ కామ మోక్షములను చతుర్విధ పురుషార్ధముల నొసంగు శ్రీరామచంద్రుని విమల కీర్తిని వర్ణించెదను.
బుద్దిహీన తను జానీకే
సుమిరౌ పవన కుమార్
బల బుద్దివిద్యా దేహు మోహి
హరహూ కలేశ వికార్
తా. ఈ శరీరము బుద్దిహీనతచె గలిగినదని తెలుసుకుని పవన కుమారుని స్మరించెదను. అతను నాకు బలమును, బుద్దిని, విద్యను ఒసంగుటయేగాక కామాది వికారములవలన గలిగిన క్లేశములను హరించుగాక..
శ్లో: బుద్దిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా
ఆజాడ్యం వాక్పుటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్
చాలీసా
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర
జయ కపీశ తిహులోక ఉజాగర
తా. జ్ఞాన గుణ సాగరుడవైన నీకు జయమగును గాకా! త్రిలోకములను ప్రకాశింపజేయు ఓ కపీశా! జయమగునుగాక!
రామదూత అతులిత బలధామా
అంజని పుత్ర పవన సుత నామా
తా. రామదూతా!సాటి లేని బలమునకు ఆటపట్టయిన వాడా! అంజనీసుతా! పవనసుతుడను పేరుగలవాడ!
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ
తా. మహావీరా! విక్రమస్వరూపా!వజ్రమువంటి శరీరము కలవాడా! చెడ్డ బుద్ధిని బోగొట్టువాడా! మంచి బుద్ధి గలవారికి తోడ్పడువాడా!
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా
తా. బంగారము వంటి శరీరచ్చాయ గలవాడా! మంచి వేషముతో నొప్పెడు వాడా! కర్ణములకు కుండలములు ధరించిన వాదా! జుట్టు ముడివైచుకొనినవాడా!
హథవజ్ర ఔధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూసాజై
తా. చేతిలో వజ్రమును, ధ్వజమును గల్గి విరాజిల్లువాడా! స్కంధమునందు ముంజను జందెమును కల్గినవాడా!
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన
తా. శంకరుని పుత్రుడా! కేసరి తనయా! గొప్ప తేజః ప్రతాపములు గలవాడా! సమస్త జగములచే నమస్కరింపబడువాడా!
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర
తా. విద్వాంసుడా! కల్యాణగుణా! చతురత్వము కలవాడా! రామకార్యమును నెరవేర్చుటకు ఆతురతపడువాడా!
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా
తా. శ్రీరామప్రభు చరితమును విను రసికుడా ! సీతా రామలక్ష్మణులను మనస్సున ధరించినవాడా!
సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా
వికట రూప ధరి లంక జలావ
తా. సూక్ష్మరూపమును ధరించి సీతకు గానబడితివి. వికట రూపమును ధరించి లంకను కాల్చితివి.
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సవారే
తా. భయంకరరూపమును ధరించి , అసురులను సంహరించితివి. రామచంద్రుని కార్యమును నెరవేర్చితివి.
లాయ సజీవన లఖన జియయే
శ్రీరఘువీర హరిషి ఉరలాయే
సంజీవిని దీసుకొనివచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. దానికి శ్రీరాముడు సంతసించి హృదయమున హత్తుకొనెను.
రఘుపతి కి హీ బహుత బడాయీ
తమ్మమ ప్రియ భరతహి సమ భాయీ
శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా బొగిడి " సోదరా! నీవు నాకు భరతునితో సమానమయినవాడ" వని పలికెను.
సహస వదన తుంహారో యశగావై
అస కహి శ్రీపతి కంఠ లగావై
వేయి నోళ్ళ నీ యశమును గానముజేసి శ్రీరాముడు నిన్ను కౌగలించుకొనెను.
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహతే
కవి కోవిద కహి సకే కహతే
తా. 14,15 సనకాది దేవర్షులు , బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైనా వారు నీ యశోగానము నెంతని చేయగలుగుదురు.
తుమ ఉపకార సుగ్రీవహి కీన్ హా
రామ మిలాయ రాజపద దీన్ హా
తా. నీవు సుగ్రీవునకు ఉపకారమొనర్చితివి. రామునితో నాతనికి సఖ్యముకావింపజేసి రాజ్య సంపద నిప్పించితివి.
తుమ్హారో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా
తా.నీ ఆలోచనలు విభీషణు డంగీకరించి లంకకు రాజయిన సంగతి లోకమంతకు తెలిసినదియే.
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహీ మధుర ఫలజానూ
తా. రెండు వేల ఆమడల దూరమునున్న సూర్యుని మధుర ఫలముగా భావించి లీలగా గ్రహించితివి.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ
జలధి లాఘి గయే అచరజ నాహీ
శ్రీరామ ముద్రికను నోట నుంచుకుని సముద్రము దాటితి వనుటలో నాశ్చర్య మేమున్నది.
దుర్గమ కాజ జగతి కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే
తా. జగము నందు కష్టమగు కార్యమేది కలదో , అది నీ అనుగ్రహమున సుగమము కాగలదు.
రామ దుఆరే తుమ రఖవారే
హోత న అజ్ఞా బిను పైసారే
తా. నీవు రామ ద్వారమును గాచువాడవు. నీ యాజ్ఞ లేక లోనికి వెళ్ళుటకు వీలులేదు.
సబ సుఖలహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కహూకో డరనా
తా. నిన్ను శరణు వేడిన సమస్త సుఖములనూ లభించగలవు. నీవు రక్షకుడవుగా నుండగా నెవరికీ భయపడ వలసిన పనిలేదు.
ఆపన తేజ సం హారో అపై
తీనో లోక హాంకతే కాంపై
తా. నీ తేజమును సంబాళించు కొనువాడవు నీవే. ఒక్క కేక వేసినా మూడు లోకములు వణికిపోవును.
భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబ నామ సునావై
తా. మహా వీరా! నీ నామమును విన్నచో భూత ప్రేత పిశాచములు దగ్గరకు రాజాలవు.
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా
తా. నిరంతరమూ వీర హనుమానుని జపించినచో సమస్తరోగములూ, సమస్త పీడలు తొలగును.
సంకట తే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై
తా. మనోవాక్కాయములచే నెవడు హనుమంతుని ధ్యానించునో , వాని నతడు సమస్త సంకటముల నుండి బయట పడవేయును.
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా
తా. రాముడు రాజులందరుకూ ముకుటము వంటివాడు. తాపసు లందరుకూ ప్రభువు వంటివాడు. ఆయన కార్యము లన్నింటినీ నీవు చక్కగా సవరించుచుందువు.
ఔర మనోరధ జో కోయి లావై
సోఇ అమిత జీవన ఫల పావై
తా. ఎవరేయే మనోరధము గలిగి యున్ననూ వారికి జీవన ఫలిత మమితముగా లభించును.
చారోయుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా
తా. నీ ప్రతాపము నాలుగు యుగములలోనూ గలదనుట ప్రసిద్దము. దానిచే జగత్తు ఉజ్వలమైనది.
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే
తా. సాధు సజ్జనులను నీవు రక్షించుచుందువు. అసురులను జంపి రామునకు ప్రియుడ వయితివి.
అష్టసిద్ధి నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా
తా. అష్టసిద్దులను, నవనిధులను నొసంగు వాడవను వరము నీకు జానకీదేవి యెసంగెను.
రామ రసాయన తుమ్హారే పాసా
సాదా రహో రఘుపతికే దాసా
తా. రామరసాయనము నీయెద్ద గలదు. నీవు రామచంద్రునకు శ్రద్దాళుడవైన దాసుడవు.
తుమ్హారే భజన రామకొపావై
జన్మ జన్మకే ధుఃఖ బిసరావై
తా. నిన్ను ప్రార్థించిన శ్రీరాముడు సంతసించును. జన్మాంతర దుఃఖములు నశించును.
అంతకాల రఘువరపుర జాయీ
జహ జన్మ హరిభక్త కహాయీ
తా. ఎచ్చట జన్మించిననూ హరిభక్తులని పిలువ బడుదురు. శ్రీరాముని పురమునకు అంత్యకాలమున బోవుదురు.
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయీ సర్వసుఖ కరయీ
తా. ఇంకొక దేవతను చిత్తమున ధరింపక హనుమంతుని సేవించిన సర్వసుఖముల నాత డొనగూర్చును.
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా
తా. బలవీరుడగు హనుమంతుని తలచిన సంకటములు, పీడలు, కష్టములు నశించును.
జైజైజై హనుమాన్ గోసాయీ
కృపాకరో గురుదేవకీ నాయీ
తా. హనుమత్ప్రభువునకు జేజేలు! శ్రీ గురుదేవుని వలే గృపజూడుము.
యహ శతవార పాఠకర్ కోయీ
చూటహిబంది మహా సుఖహోయీ
తా. దీనిని నూరుసార్లు ఎవరు పఠనము చేయుదురో వారికి బంధములు వీడి సుఖములు కలుగును.
జో యహ పడై హనుమన్ చాలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా
తా. హనుమాన్ చాలీసా యను నీ స్తోత్రము నెవరు పఠించెదరో వారికి పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ది కలుగును.
తులసీ దాస సదా హరి చేరా
కీజై నాధ హృదయ మహ డేరా
తా. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసే. ఓ నాధా! నీవు నా హృదయములో నుండుము.
దోహ : పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్ (తులసీదాసు)
తా. ఓ మంగళరూపా! సీతా రామలక్ష్మణ సహీతుడవయి సమస్త సేవలతో నీవు నా హృదయమున నుండుము.
శ్లో: రామాయ , రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము
**************************************************************************

No comments:

Post a Comment