Friday, January 18, 2019

పెద్ద పెద్ద (శబ్ధ) వాయిద్యాల‌తో రంజిల్లిన... రుంజు

జానపద కళలు జాతికి జీవనాడులు. విభిన్న కుల, మతాల సంగమమైన ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ జానపదుల పదముద్రలు లేని చోటు లేదు. కళారూపాల ధ్వనులు విన్పించని ప్రాంతం లేదు. ఆధునిక వ్యాపార సంస్కృతీ వలయంలో పడి, ఎన్నో జానపద కళలు చెల్లాచెదురై పోతున్నా.. కొన్ని కళలు కొన ఊపిరితో మిణుకు మిణుకుమంటూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ గ్రామీణులకు ఎన్నో తరాల నుంచీ తెలిసిన వాద్య కళారూపం 'రుంజ'.
ఇది విశిష్టమైన కళ !రుంజ
రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కళింగాంధ్రలో, కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు ఉపయోగిస్తారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చు...తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత(కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు,జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు.  అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు.  విశ్వ బ్రాహ్మణుల గోత్రాలను , వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు.  వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు.  రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.
జాతి నిర్మాణానికి మూలాలుగా ఉన్న జానపద కళా రూపాల్లో రుంజలది విశిష్ట స్థానం. రుంజ కళాకారులు దాతకులాల వారిని ఆశ్రయించి, గోత్రాలు పొగిడి వారి వంశ చరిత్రలు పాడి, జీవనోపాధి పొందుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆశ్రిత కళాకారుల్లో వీరభట్టులు, భట్రాజులు, విప్రవినోదులు, పుచ్చుకుంట్లు, రుంజలు, పొడాపోతల వారు, మాలమాష్టివారు తదితర రకాల వారున్నారు. వీరు ఆయా దాతకులాలను ఆశ్రయించి, వారి వంశ చరిత్రలు పాడి.. జీవనోపాధి పొందుతారు. బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్యులకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులు, మాల కులస్తులకు మాలమాష్టివారు కళాకారులుగా ఉన్నారు. రుంజ కళాకారులు విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. వీరు వ్యవసాయంతో పాటు రుంజ వృత్తిని చేపడతారు...
ఇది అన్ని వాయిద్యాల్లో పెద్దది...
చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ. దీని శబ్ధం రెండు మూడు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. రుంజను ఇత్తడితో తయారుచేస్తారు. బలమైన కట్టెపుల్లలతో వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడా వాడుకలో ఉంది... రౌంజకాసురుణ్ణి వధించి అతని తోలుతో చేసిన రుంజ వాద్యం, రుంజ అనే వాయిద్యాన్ని రౌంజ అని కూడా అంటారు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాని నిలబెట్టి వాయిస్తారు. ఇత్తడితో తయారు చేసిన ఈ రుంజ పై భాగంలో తోలును అమర్చుతారు. ఆ తోలును తాళ్లతోలాగి గట్టిగా బిగించడంతో ఇది ఒక ధ్వని వాయిద్యం అవుతుంది. ఈ వాయిద్యాన్ని గట్టి కర్రపుల్లలతో వాయింస్తారు. ఈ రుంజల నుండి వచ్చే ధ్వని యుద్ధ భేరీ నాదాలను మరిపిస్తాయి. ఈ వాయిద్యాన్ని వాయించే సమయంలో రుంజవారు తమ శక్తినంతా చేతుల్లోకి కూడదీసుకుని వాయించడంతో దిక్కులుపిక్కటిల్లేవి. రుంజా వాయించేది ముఖ్యముగా సప్తస్వరాలలో భయానక, వీరత్వ శబ్దాలకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో శబ్దంలో ఒక్కో పదం ఇమిడి ఉంటుంది. అత్యద్భుత ప్రదర్శనా విన్యాసం కూడా ఇందులో భాగమే. జానపద చర్మవాద్యాలలో ‘రుంజ’ ఒక సైనిక కవాతు. మార్చింగ్ తర్జు. వీరత్వ ప్రకటన...
ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదిగా చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల ఈ రుంజ గురించి పురాణకథ కూడా ఇలా ప్రచారంలో ఉంది. పార్వతీదేవి తన కల్యాణానికి వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరిందనీ, అప్పుడు విశ్వకర్మ రౌంజకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యంతోనే పార్వతీ కల్యాణం దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణం ద్వారా ప్రచారంలో ఉంది...
రుంజ కళాకారులు సంగీత సంబంధ సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ ప్రదర్శిస్తారు. మూలస్తంభం, పంచముఖ బ్రహ్మావిర్భావం, పార్వతీ కల్యాణం తదితర కథల్ని చెప్పటమే కాక, మధ్యలో శ్రావ్యమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్యాన్ని రుంజపై పలికిస్తారు.
పూర్వం రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరించేవారు. ఈ సందర్భంగానే పంచ బ్రాహ్మలను గురించి, వారి వంశోత్పత్తిని చెపుతారు. పంచ బ్రహ్మలు మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మొదలైనవారి విధులను వివరిస్తారు. మనువుకు ఇనుప పనీ, వద్దుకు కర్రపనీ, త్వ్రష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞునికి బంగారు పనీ కేటాయించారని వివరిస్తారు. పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం, విశ్వగుణా దర్శనం, వీరభద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనం, దేవ బ్రాహ్మణ మహత్మ్యం, మూలస్తంభం, సనారి విశ్వేశ్వర సంవాదం, విశ్వ ప్రకాశ మండలం మొదలైన వాటిని కథలుగా చెపుతారు.
ఆచారిల ఇంట్లో...
రుంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి, అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవిస్తారు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం, బట్టలు కూడా పెడతారు. అలిఖితమైన అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులకు మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతోంది...
ప్రభుత్వ గుర్తింపు కరువు
ఈ కళాకారులు ఇంతకాలం ప్రభుత్వ గుర్తింపునకు, సహాయానికి నోచుకోలేదు. సామాజిక మార్పుల వల్ల ఈ కళ వీరితోనే అంతరించిపోతుంది. సినిమాలు, టీవీలు రావడంతో వీరి కళకు ఆదరణ కరువైంది. అన్ని జానపద కళా రూపాలతోపాటు రుంజ కూడా మరుగున పడుతోంది. కులవృత్తులు ఆర్థిక ఇబ్బందుల్లో పడడం వల్ల విశ్వబ్రాహ్మణులు కూడా వీరిని ఆదరించడం తగ్గింది. కళింగాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరు ఉన్నప్పటికీ తగిన గుర్తింపు లేదు. ఇతర దేశాలలో ఇలాంటి అరుదైన కళారూపాలకు అధునాతన సాంకేతికత జోడించి, వీటిని కనుమరుగు కాకుండా చూస్తారు. ఈ కళాకారులను ప్రోత్సహించి, ఈ కళను గ్రంథస్తం చేయాలి. అపుడే ఈ కళాజ్ఞానం సమాజంలో సజీవంగా ఉంటుంది. ఏ కళకైనా ఇదే వర్తిస్తుంది...
మంగళం
ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||
రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ వుంది.
అంబా స్తుతి
కాంభోజి రాగం.
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................||అంబా||
ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్
గజ్జలు ఘల్మనంగ.....................||అంబా నీవిందు రావే||
అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచ ముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వ కర్మ రక్షిస్తున్నాడఆంటూ సకల విశ్వం యొక్క కర్తవ్వాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు.... అలాగే..................
ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకఆంబు లెట్లో.... జలోపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భారకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ య్వరి తరము
తెలివి గలిగి కృతజ్ఞలైన తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ
అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలొనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేక పోతే జగత్తు జరగదనీ వివరిస్తూ వుంది. పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు. వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.
1.తక్కు ధిక్కు , ధిక్కు తకథిక్కు తకయని
అంబుజాసనుడు తాళంబు వేయ
అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలలలో తాళం వేస్తారు.
2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదఆంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ల్ఘాతవేసి
తాళము చూపును మృధంగ ధ్వన్యను కరణ చేయును.
3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట
అని తాళము చూపును.
4. కకుందకు ధరికిట తుతుందక ల్యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండె గురుతులు నెలదాల్చు
శ్లోకం||
చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.
ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. అవే కాక నాద బ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంగికా స్వాన్ని సమిష్టిగా రాగ యుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు

Brahmasri Viswakarma Koteswara Rao vari pravachanam about Viswakarma

Thursday, January 17, 2019

రుంజలు...!

రుంజలు...!

దూదేకుల సిద్దయ్య...

యన అసలు పేరు సిద్దయ్య కాదు, ఇది బ్రహ్మం గారు పెట్టిన పేరు అని విన్నాను. నిజమేనా? --వైఙాసత్య 06:43, 12 అక్టోబర్ 2006 (UTC)
ముస్లిముతల్లిదండ్రులు ఈయనకు సిద్దీఖ్ అనే పేరుపెట్టారంటారు. " సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు.పూర్వజన్మలో అతడు క్షత్రియుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మించాడు.ఆ గోహత్య పరిహారార్ధం నా శిష్యుడయ్యాడు.అతడు ఈ లోకాన్ని విసర్జించిన జ్ఞానయోగి.అతడికి అద్వైత విషయంలో ఆసక్తి కలిగి సిద్ధిని పొందాడు.అందుకే అతనికి సిద్ధుడని నామకరణం చేసి నా ప్రధమ శిష్యుని గావించాను" అని బ్రహ్మం గారు చెప్పినట్లు సుజాత గారి వ్యాసంద్వారా ఇప్పుడు తెలిసింది.మరుజన్మలేకుండా అతను సిద్ధి పొందాడంటారు.బ్రహ్మంగారు చెప్పిన సిద్దయ్య జన్మ రహస్యాన్ని బట్టి పూర్వజన్మలో గోహత్య చేసిన క్షత్రియులు మహమ్మదీయులుగా పుట్టిఉంటారని సూత్రీకరించుకోటానికి వీల్లేదు. --Nrahamthulla 04:54, 25 నవంబర్ 2008 (UTC)

బాస రాని సాయిబులు : దూదేకుల సిద్దప్ప(బ్రహ్మంగారి శిష్యుల్లో మహాజ్ఞాని)ఇతని పేరు సిద్దీఖ్.క్రమేణా సిద్దయ్య గా మారిందంటారు. ఆయనకి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువు గారి కాలజ్ఞానతత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడు కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు (కంసాలీలు/విశ్వబ్రహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ భాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా ఎంచినట్లూ నాకు తెలియదు. ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు. లింగిపెళ్ళీ మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకుని సంఘంలోకెళితే, అసలు సిసలు సాయిబు (ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనప్పుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరని అసలు అందులో పసలేదని చప్పడిస్తుంటారు. భాషవేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖానా అంటావు. నేను అన్నం అంటాను అంటాడు.ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదైపోతాడు.
ఇటీవల 'పింజారీ వెధవ ' అనేతిట్టు టీ.వీ. సీరియల్స్ లో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది.బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారీ" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనుకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో భాదపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట.అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు.ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడ ల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. అయితే ఆతోకలతో పిలవచ్చా పిలవ కూడదా,
పిలిస్తే ఎమవుతుందో అనే భయంతో మిన్నకుండా ఉన్నారు. ఒకనాడు అవమాన సూచికగా తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్ధార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించు కుంటుంది. అలాగే బాసరాని పింజారులు లద్దాఫులు నొచ్చుకోవద్దు క్రుంగిపోనక్కరలేదు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే పదిమందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ భాషా"లుగా దూదేకుల సిద్దయ్య లాగామన్నన పొందుతారు.

Saturday, January 5, 2019

దర్భలు (గరికి గడ్డి)కున్న ప్రాముఖ్యత!!

నకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాల్లాంటి శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు.
కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి దర్భలుగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశం(దర్భ) అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అని చెప్పబడింది.
వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు.
అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే:
సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది.
అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు).
కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ ఎక్స్-రే తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట.
దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండటమే కారణమట.
ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. "శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనఃనాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం" అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది.
అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది.
ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడాలని ఉంది.
అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయాలని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.
దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అంటారు. అంటే, దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.
వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట.
దర్భల్ని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజనుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి.
దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.