Thursday, April 5, 2018

అరకు కాఫీ.. అంతర్జాతీయ ఖ్యాతి


నాగరికత ప్రస్ధానంలో మద్యేతర పానీయాలు  కేవలం మూడిటిమటుకే అన్ని దేశాల్లో సార్వజనీనంగా ఆదరణ లభించింది. ఈ మూడిటిలో మొదటిస్ధానంలో టీనిలబడితే రెండోస్ధానంలో కాఫీ, మూడో స్ధానంలో కోకోవుంటాయి. అయితే అంతర్జాతీయంగా జరిగే వ్యాపారపరంగా చూస్తే కాఫీ’, పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎగుమతి దిగుమతి చేసుకునే అతి పెద్ద ఉత్పాదన. కాఫీకి వున్న వ్యామోహం ఆదరణ చూస్తే ఆది ఒక కొత్తరకపు నాగరికతకీ, జీవనశైలికి చిహ్నంగా మారింది. కాఫీ అనేది యిపుడు మనిషికి అవసరమైన పానీయం స్ధాయి నించి ఎదిగి శక్తినీ, ఉత్పాదకతనూ పెంచే ఔషధం స్ధాయికి చేరిందనడంలో సందేహం లేదు.
కాఫీ పుట్టుక
కాఫీ ప్రపధమంగా ఆఫ్రికా ఖండంలో పుట్టి యితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇపుడు సుమారు 70 దేశాలలో కాఫీ పండుతోంది. ఇధియోపియాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు పూర్వీకులు మొదటిసారిగా కాఫీని గుర్తించడం జరిగింది. ‘కల్డిఅనే ఇధియోపియాకు చెందిన పశువుల కాపరి కాఫీమొక్కను గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. ఇధియోపియా నించి క్రమంగా యిది అరేబియాకి వ్యాప్తి చెందింది.
భారతదేశంలో కాఫీ
16వ శతాబ్ధంలో సూఫి సన్యాసి బాబా బూదాన్‌ ఏడు కాఫీ గింజల్ని అరేబియా దేశస్తుల కళ్ళుగప్పి భారతదేశం తీసుకువచ్చాడు. వాటిని కర్ణాటకలోని చిగ్‌మగళూర్‌లో తన ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగా యిపుడు పండిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ
1898లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి బ్రాడీచేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి  పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి మరియు చింతపల్లి ప్రాంతాలకి విస్తరించినా అది విసృత వ్యాప్తికి నోచుకోలేదు.
అరకు కాఫీపుట్టుక
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పచెప్పారు.
1956 లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డక, కాఫీ బోర్డు వారు యీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం వుపయోగించుకోవాలని వుద్దేశించారు. ఆ రకంగా గుర్తింపబడి, గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృది
విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ రకంగా సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి అరకుకాఫీఅనే పేరు స్ధిరపడింది.
1985 తర్వాత జిసిసి ఆధ్వర్యంలో అరకుకాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ (గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) స్ధాపించారు. ఈ రకంగా జిసిసిద్వారా మరియు జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంచి ఇచ్చారు.
1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎ లో విలీనంచేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగానూ, MGNREGS నిధుల సహాయంతో అభివృద్ధి చేసి యీ నాటికి లక్ష ఎకరాలకు చేరి, కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు.
అరకు కాఫీ ప్రత్యేకతలు
భారతదేశంలో పశ్చిమ కనుమల ప్రాంతం కాఫీ తోటల పెంపకంలో గత శతాబ్ధి కాలంలో బాగా అభివృద్ధి చెందితే, తూర్పుకనుమల ప్రాంతం కాఫీ పంటలో యింకా అభివృద్ధి చెందుతూనేవున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖజిల్లా అరకు ప్రాంతం అత్యంత అందమైన ప్రాంతమేకాక అత్యంత అందమైన పక్షులు, రామచిలకలకు ఆలవాలంగా వుంది. అరకు ప్రాంతంలోని అరేబికారకం కాఫీ అత్యంత ప్రసిద్ధి చెందింది. పనస, సిల్వర్‌ఓక్‌, మరియు అరటి చెట్ల నీడలో పెరిగే యీ కాఫీ సేంద్రియ పద్దతుల్లో సాగుచేయబడుతున్నది. కాగా, యీ ప్రాంత అటవీ సంపదను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడేదిగా వుంది. అరకులోయలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలలో లక్షకు పైగా గిరిజన రైతులు యీ కాఫీ పంట ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ ప్రాంత గిరిజనులు తాము సాంప్రదాయకంగా చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారనేది అందరికీ ఆహ్లాదకరమైన వార్త. అరకులోయలోని కాఫీ పంట ప్రకృతికి మంచిచేసేదిగా, గిరిజనులకు కల్పతరువుగా మారిందంటే అతిశయోక్తి లేదు.
అరకు కాఫీకి అద్భుత రుచి ఎలా వచ్చింది?
అరకులోయలో పండుతున్న కాఫీ సుమారు 900 నుంచి 1100 మీటర్ల ఎత్తున పండినదైనందువల్ల యిక్కడి నేలలో మితమైన క్షారగుణం కలిగినందువల్ల యిక్కడి పండే కాఫీకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడ్డాయి.
కాఫీ గింజల పరిమాణం లోగాని, నేలసారం వలన కలిగే గుణాల వలన, మితమైన పుల్లటి జీర జిహ్వకి తగులుతూ, స్పష్టమైన గాఢతర సువాసన, మరియు నాలుకకి తగలగానే నరాల్ని కదిలించే క్షారగుణంతో అరకు కాఫీఒక ప్రత్యేకమైన రుచి గల కాఫీగా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.
ఆకెళ్ళ రవిప్రకాష్ (raviprakash2525@gmail.com, Call-9490517777)



No comments:

Post a Comment