సుందరకాండ
-
-
- సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
- సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం
- సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి:
- సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?
- పెద్దలైనవారు సుందరకాండ గురించి ఈ మాట అన్నారు, ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు.
-
సుందరకాండ తత్ తో ప్రారంభమయ్యి తత్ తో ముగుస్తుంది. తత్ అంటె పరబ్రహ్మము. సుందరకాండని ఉపాసనకాండ అంటారు. పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది.
తతొ రావణనీతాయాహ్ సీతాయాహ్ శత్రుకర్షనహ్ |
ఇయెష్హ పదమన్వెష్హ్టుం చారణాచరితె పథి ||
రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు(భూమికి దెగ్గరగా ఉండి, సర్వకాలములయందు సుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు) వెళ్ళే మార్గంలో వెళ్ళడం కోసం హనుమ సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యడానికి వెళుతున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు. వైఢూర్యములలా మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడాయన బయలుదేరేముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నధుడు అవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు. అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి.
హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగ ఆ పర్వతాన్ని తొక్కారు. అప్పుడు ఎన్నాళ్ళనుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటకి వచ్చేలోపే, ఆ కలుగు నొక్కుకుపోయింది. అప్పుడు కొంత భాగం బయట, కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడా పాములు ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. అప్పుడు ఆ విషంలోనుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.
ఎష్హ పర్వతసంకాషొ హనూమాన్ మారుతాత్మజహ్ |
తితీర్ష్హతి మహావెగహ్ సముద్రం మకరాలయం ||
అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైనవారు వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు " ఏమి ఆశ్చర్యం రా, పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవ్వాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు " అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు.
అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపి, ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి, గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి, తొడలని విశాలంగా పక్కకు పెట్టి, ఒకసారి అక్కడున్న వానరాల వంక చూసి " రాముడి కోదండం నుండి విడువబడ్డ బాణంలా నేను లంకా పట్టణం చేరుకుంటాను, అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతె అక్కడినుండి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే, అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను " అని ప్రతిజ్ఞ చేసి, తన పాదాలని పైకెత్తి ఆ పర్వతం మీదనుండి బయలుదేరాడు.
హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాలనుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహా వృక్షాలు వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి. ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలని కురిపించాయి. తేలికయిన చెట్లు చాలా దూరం వెళ్ళాయి, బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి. అలా వెళిపోతున్న హనుమంతుడిని చూసినవారికి " ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడ, సముద్రాన్ని తాగుతున్నాడ? " అని అనుమానం వచ్చింది. పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేసాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు, తాబేళ్లు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళి బయటకి వస్తూ ముందుకి వెళుతున్నాడు.
హనుమంతుడు అంత వేగంతో వెళిపోతుంటే కిందనుంచి సాగరుడు చూసి " సాగరములు ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక, అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళుతున్నాడు కనుక, ఆయనకి ఆతిధ్యం ఇవ్వడం మన ధర్మం " అని అనుకొని తనలో ఉన్న మైనాకపర్వతం వంక చూసి " నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్రమార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింద వాళ్ళు పైకిరారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిధ్యం ఇవ్వడం కోసమని ఒకసారి పైకి లె, ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు " అన్నాడు.
అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే, ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమంతుడు " ఓహొ, ఇప్పటివరకూ ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డువస్తున్నారు " అని అనుకొని, తన వక్ష స్థలంతో ఆ శిఖరాలని ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమయ్యి కింద పడిపోయాయి.
అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి " అయ్యా! మామూలువాడే అతిధిగా వస్తే విడిచిపెట్టము, మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిధివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చెయ్యడం అనేది చెయ్యవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది, నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారము పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ' పోనిలే సముద్రంలో పడితే పడ్డాడు కాని, రాక్షసులు బయటకి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు ' అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు.) అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళి హాయిగా వెళ్ళిపో " అన్నాడు.
అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో ముట్టుకుని " నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు నాకు ఆతిధ్యం ఇచ్చినట్టె, నేను పొందినట్టె, నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను, మధ్యలో ఎక్కడా ఆగకూడదు " అని చెప్పి వెళ్ళిపోయాడు.
బయటకి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి " ఓహొ! ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటకి వచ్చావు కదా " అన్నాడు.
అప్పుడు మైనాకుడు " ఈ ఇంద్రుడు నా రెక్కలని తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను " అనుకున్నాడు.
అప్పుడు ఇంద్రుడు అన్నాడు " నాయనా మైనాక! ధైర్యంగా హనుమకి సహాయం చెయ్యడం కోసం బయటకి వచ్చావు. రామకార్యం కోసం వెళుతున్నవాడికి ఆతిధ్యం ఇవ్వడం కోసం బయటకి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను " అని అభయమిచ్చాడు.
అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) " చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి " అన్నారు.
అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో " నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నూట్లోకి దూరు " అనింది.
అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి " నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను " అన్నాడు.
అప్పుడా సురస " అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే " అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి " అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను " అన్నాడు.
" ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక " అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.
అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడినిసింహిక అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మోదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.
అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.
No comments:
Post a Comment