Monday, July 18, 2011

లక్షల కోట్లకు ‘పడ’గెత్తిన పద్మనాభుడు!

పుణ్య క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన ధర్మ క్షేత్రం భారతావని. ప్రతి గుడికి ఐతిహాసిక ప్రాశస్త్యమే కాదు బలమైన చారిత్రక నేపథ్యమూ ఉంది. శతాబ్దాల కేరళలోని తిరువనంతపురంలో విలసిల్లిన విశిష్ట పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయం. అపూర్వ సాంస్కృతిక వారసత్వానికే కాదు.. సిరిసంపదలకూ ఈ ఆలయం రాజులు పెట్టిన కోటే! శ్రీ మహావిష్ణువు అనేక రూపాల్లో కొలువుదీరిన ఆలయాలెన్నో దేశంలో ఉన్నా పద్మనాభుడిది మాత్రం ప్రత్యేక భంగిమే. సేదదీరుతున్న ఆకృతిలో కొలువుదీరిన మహావిష్ణువు రూపమే ఈ ఆలయ వల్లభుడు. అద్భుత నిర్మాణ వైభవం.. దాన్ని మించిన రీతిలో కనువిందు చేసే ఆలయ ఆది దేవత స్వరూపం చూడగానే ఎవరినైనా వివశుల్ని చేసేదే అనడంలో సందేహం లేదు. దీని కట్టుబాట్లు, సంప్రదాయాలు ఎంత ప్రత్యేకమైనవో.. ఆలయాన్ని అల్లుకున్న కథలూ, చారిత్రక వాస్తవాలూ అంతే విశిష్టమైనవి! ఇప్పటి వరకూ ఈ గుడిని దాని అంద చందాలను, నిర్మాణ వైశిష్ట్యాలనే చూసిన కోటాను కోట్ల మంది భక్తులకు తాజాగా వెలుగు చూస్తున్న అంశాలు ఎనలేని ఆసక్తిని కలిగిస్తున్నాయి. అపారమైన సంపద నిక్షిప్తమైందన్న వాస్తవాలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. దేశం విపత్తులమయం అయినప్పుడు.. సంక్షోభాలు, క్షామాలు సంభవించినప్పుడు ఆపద్ధర్మంగా వినియోగించుకునేందుకు వీలుగా నాటి రాజులు నిక్షిప్తం చేసిన సంపద విలువ నేటి లెక్కల ప్రకారం.. లక్ష కోట్ల రూపాయలుగా తేలింది. ఇదంతా ఎ,బి అన్న చాంబర్లలో మొదటి చాంబర్‌ను తెరిస్తేనే బయట పడ్డ అపార సంపద. బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు, మణిమకుటాలు, రత్నాలు ఇలా ఎన్నో.. ఎనె్నన్నో అపురూప వస్తువులు వెలుగు చూడటం ఎవరినైనా ఆశ్చర్య పరిచేదే.. జనకోటిని అబ్బురపరిచేదే. ఎప్పుడైతే మొదటి చాంబర్ తెరిచి అపార సంపదను వెలికి తీశారో.. ఒక్కసారిగా కథలు బయలుదేరాయి. ‘బి’చాంబర్ తెరిస్తే అంతే సంగతన్న భయాలూ పుట్టుకొచ్చాయి. దానితో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ వెంటనే సంపద లెక్కింపును నిలిపివేసింది. సుప్రీం కోర్టుకు మొత్తం వివరాలను వెల్లడించడంతో పాటు రెండో చాంబర్ తెరిస్తే.. ఉపద్రవాలు సంభవిస్తాయన్న ప్రచారాన్ని సుప్రీంకు నివేదిస్తామని వెల్లడించింది. బయటపడిన సంపద విలువ మొదట వేల కోట్లని అనంతరం లక్ష కోట్లని ఆ తర్వాత ఐదు లక్షల కోట్లంటూ వార్తలు రావడంతో పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా రాత్రికి రాత్రే మారిపోయింది. సుప్రీం కోర్టు కనుక నేలమాళిగలను తెరవకపోయి ఉంటే తిరువనంతపురం ఆలయం మామూలు ఆలయంగానే మిగిలిపోయేది!

No comments:

Post a Comment