Wednesday, November 25, 2015

పూజ చేసే సమయం లో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా ?


కొబ్బరి కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోష మేమీ కాదు. అపచారం అంతకన్నా కాదు ఇది ఎవరికీ తెలిసిన పని కాదు అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరి కాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలా పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషము గా పరిగణించ అవసరంలేదు అపచారం ఎంతమాత్రం కాదు. కొన్ని దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను, అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే...క్రుళ్ళిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మరలా కొబ్బరికాయ కొట్టాలి.

Sunday, November 15, 2015

మా ఇంటి దీపావళి( పొటోలు ) నాగుల చవితి

మా ఇంటి దీపావళి 2015( పొటోలు )
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.


దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.


ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
                             నాగుల చవితి




దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.


ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ,


మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.


 

Sunday, August 30, 2015

వరలక్ష్మిదేవి వ్రతం పలితం




 సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీలకు తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరినప్పుడు,పార్వతీదేవికి ముక్కంటి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పినట్లు శాస్త్రాలు వెల్లడించాయి. స్త్రీల ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగమైపోయిన 'నోములు - వ్రతాలు'లో 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' గురించి తెలుసుకుందాం.

సంపద వుంటే సగం సమస్యలు దూరమైనట్టే. అలాంటి సంపద లభించాలంటే సకల సంపదలకు పుట్టినిల్లు అయిన 'శ్రీ వరలక్ష్మీ దేవి' అనుగ్రహం ఉండాలి. అందుకోసం 'శ్రీ వరలక్ష్మీ వ్రతం' ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి పీఠంపై అమ్మవారి ప్రతిమను ... కలశాన్ని పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక ఆచమనం చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కరించాలి. గణపతి ప్రార్ధన ... ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధన చేసి ... అమ్మవారిని ధ్యానించి ఆవాహన చేయాలి.

 అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించి అర్ఘ్య పాద్యాలను ఇవ్వాలి. ఆ తరువాత పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించి .. శుద్ధోదక స్నానం చేయించి వస్త్రాభరణాలు .. పసుపు కుంకుమలు .. పూలు .. గంధం .. అక్షితలు సమర్పించాలి. ఆ తరువాత వరలక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించాలి.
 ఈ వ్రతం యొక్క కథ :
 ఈ వ్రతం ఆచరించడానికి అవసరమైన ఈ కథను చెప్పుకోవాలి. పూర్వం మగధదేశంలోని ఓ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 'చారుమతి 'అనే ఇల్లాలు వుండేది. ఆమె వరలక్ష్మీ దేవి భక్తురాలు. భర్త మనసెరిగి నడచుకోవడమే కాకుండా, అత్తమామలను తల్లిదండ్రులవలే ఆదరిస్తూ వుండేది. నిరంతరం ఇంటి పనుల్లో నిమగ్నమవుతూనే, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉండేది. చారుమతి వినయ విధేయతలు ... భక్తి ప్రపత్తులకు మెచ్చిన వరలక్ష్మీ దేవి కలలో కనిపించి ఆమెపట్ల తనకి గల అనుగ్రహాన్ని తెలియజేసింది. 'శ్రావణ పౌర్ణమి'కి ముందు వచ్చు 'శుక్రవారం' తన వ్రతమును ఆచరించించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పింది. మరునాటి ఉదయం తనకి వచ్చిన కల గురించి చారుమతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లంతా కూడా అమ్మవారు చెప్పినట్టుగా చేయమని ఆమెను ప్రోత్సాహించారు. దాంతో చారుమతి తమ ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పింది. ఆ రోజున అందరూ రావాలని ఆహ్వానించింది. 'శ్రావణ శుక్రవారం'రోజున అంతా చారుమతి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే ఆమె అమ్మవారి కోసం పీఠాన్ని సిద్ధం చేసి దానిపై కలశాన్ని ఉంచింది. ఆ తరువాత షోడశోపచారాలతో అమ్మవారిని పూజించి ... తొమ్మిది పోగుల తోరమును ధరించి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. దాంతో ఆమెతో పాటు మిగతా వారు కూడా ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టారు. అలా వాళ్లు ఒక్కో ప్రదక్షిణ చేస్తుండగా వాళ్ల ఇళ్లలో సిరిసంపదలు పెరిగిపోసాగాయి. మూడు ప్రదక్షిణలు పూర్తి కాగానే వాళ్లందరి ఇళ్లు ధన కనక వస్తువులతో నిండిపోయాయి. అమ్మవారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన వీళ్లంతా, ప్రతి ఏడాది చారుమతి చేసిన తరహాలోనే వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ వ్రతం చేసినా .. చూసినా .. కనీసం విన్నా .. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Friday, August 28, 2015

Monday, June 29, 2015

యాత్రా అనుబవం రుక్మిణీదేవి మందిరం

                                                     యాత్రా అనుబవం రుక్మిణీదేవి మందిరం



బెట్ ద్వారక చూడడానికి  బస్సులో బయలుదేరాం. మార్గమద్యంలో రుక్మిణి మందిరం చూసాము.  రుక్మిణి మందిరంలో కుడ్య శిల్పంగా  కృష్ణుడు , రుక్మిణీదేవి దుర్వాసుడి రధం లాగుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. 
మాతో వచ్చిన గైడు ఇక్కడకు చుట్టుపక్కల 5  కిలో మీటర్ల  దూరం  వరకు మంచి నిరు లభించదని అది దుర్వాసుడు రుక్మిణి దేవికి ఇచ్చిన శాపమని వివరించాడు. రుక్మిణీదేవి దుర్వాసుడి ఆదేశం మీరీ దాహార్తి తీర్చుకోవడానికి కొంత జలం సేవించిన కారణంగా ఇటువంటి శాపానికి గురి అయిందని. కానీ ఇక్కడ ఉన్న ఒక బావిలో మాత్రమే మంచి నీరు దొరికేలా శాపవిమోచనం చెప్పాడని తెలుసుకున్నాము.
 రుక్మిణిదేవిని దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చాము. వెలుపల స్త్రీపురుషులు ఆనందంగా నృత్యం  చేయడం చూసి ఆనందించాం. మేము కూడా నృత్యంలో పాల్గొని ఆనందించాం
 ఆలయం దర్శించి నృత్యాలు చూసిన ఆనందంతో వెలుపలికి వచ్చి ఆలయానికి ఎదురుగా కొంత దూరంగా   కూర్చున్న బిక్షువులని చూసాం. వారు చక్కని శుభ్రమైన దుస్తులు ధరించి క్రమ శిక్షణగా కూర్చున్నారు వారిని భిక్షువులు అంటే నమ్మబుద్ధి కాలేదు. వేషధారణ అలా ఉంది మరి. గైడు వారి గురించి ఇలా చెప్పాడు. ఆలయ నిర్వాహకులు వారిని ఇలా కూర్చోమని చెప్పారని భక్తులు తమంతట తాము ఏదైనా ఇస్తే మాత్రమే పుచ్చుకుంటారని. ఏది ఇచ్చినా సమానంగా పంచుకుంటారని చెప్పారు.  మాలో కొందరు వారికి కొంత ధన దానం చేసారు. వారి క్రమ శిక్షణ చూస్తే ముచ్చట  వేసింది.ఆ తరువాత మా ప్రయాణం కొనసాగించి బెట్ ద్వారక చేరుకున్నాము.
 మరుసటి రోజు ఉదయానికి  గోమతీ ద్వారక  చేరుకున్నాము. ఇక్కడ గోమతి నది సముద్రంలో సంగమిస్తుంది. గోమతి ద్వారకలో కృష్ణుడు రాజ్యకార్యకలాపాలు నిర్వహించిన ప్రదేశం. ఇక్కడ కృష్ణుడి మనుమడైన వజ్రనాభుడు ఆలయం నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.  10వ దశాబ్దంలో ఈ ఆలయ పునర్న్ర్మానం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 
స్నానాదికాలు చేసి  ఆలయ దర్సనానికి బయలుదేరం.అక్కడ గోకుల్ హోటల్ నుండి అటోలలో  ఆలయానికి వెళ్ళాం. ఆలయంలో కెమెరా సెల్ ఫోన్లను అనుమతించరు కనుక చాయాచిత్రాలు తీసే అవకాశం లేదుమరి.  లోపలకు వెళ్లి కృష్ణుడి చిత్రాన్ని కొనుక్కుని ఆలయ దర్శనం చేసుకోవడానికి  వెళ్ళాం.  ఆలయ ప్రదిక్షణ  చేసి స్వామి సన్నిధిలో క్యూలో నిలబడి  దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేయడానికి వత్తిడి లేదు కనుక సులువుగా దర్సనం అయింది. 
ఈ ఆలయానికి  గోపురం మీద జండా ఒక రోజుకు ఐదు సార్లు ఎగుర వేస్తారు. భక్తులు ఈ జండా ఎగురవేయడానికి అనుమతి తీసుకుని జండా సమర్పిస్తారు. సమర్పించే భక్తులను కూడా పై వరకు  తీసుకు వెళ్లి ఆక్కడ పూజ చేయించి ఆలయ కార్యకర్తలు జండా ఎగురవేస్తారు. ఈ జండాను భక్తులు  అత్యంత శ్రద్ధతో తాకి నమస్కరిస్తారు.  ఈ జండా ఎగురవేయడానికి కొన్ని సంవత్సరాల ముందే నమోదు చేసుకుంటారు కనుక ఈ అవకాశం లభించడం అపురూపంగా భావిస్తారు. ఇలా ద్వారకలో కృష్ణుడి జండా ఇప్పటికీ ఇలా నిరంతరంగా  ఎగురుతూనే ఉంది.  ఇలా దర్శనం  చేసుకుని వెలుపలికి వచ్చి అలా కూర్చున్నాము. అప్పుడు అక్కడ ఆలయం చూపడానికి గైడ్ వచ్చాడు. గైడ్ వెంట పోయి తిరిగి ఆలయం అంతా తిరిగి వివరంగా చూసాము. 
ఇక్కడ కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడికి తనకుమారుడైన అనిరుద్ధిడితో ప్రత్యేక ఆలయం ఉంది. బలరాముడికి,  రేవతికి, దేవకీ, వసుదేవులకు, వాసుదేవుడికి, రుక్మిణి, సత్యభామ, జాంబవతికి, సుభాద్రలకు  విడి విడిగా సన్నిధులు ఉన్నాయి. ఈ ఆలయములో దర్శనం  అయిన తరువాత స్త్రీలు  గుంపులు గుంపులుగా కూర్చుని ఆలయ ఆవరణలో కూర్చుని కృష్ణుడి  చిత్రం ముందు పెట్టుకుని కృష్ణుడి గీతాలు పాడుకుని వెలుతూ ఉంటారు. 
ఇది చూడడానికి వినడానికి కూడా ఆసక్తిగా ఉంది. ఆలయం నుండి వెలుపలికి రాగానే పక్కనే గోమతి నది సాగరసంగమం చేసే ప్రదేశం చేరుకున్నాము. అక్కడ మరి కొన్ని ప్రదేశాలు చూసి తిరుగు ముఖం పట్టాము. సాయంత్రానికి తిరిగి సమీపంలో రుక్మిణి ఆలయం , శివుడి గుడి  అలాగే అక్కడే ఉన్న చిన్న చిన్న ఆలయాలను చూసాము.  తిరిగి రాగానే మళ్లీ కృష్ణుడి దర్శనానికి వెళ్ళాము. ఇలా మా యాత్ర ముగిసింది.

క్రీ"శే..పాలవలసవరహాలమ్మ28వ వర్థంతి....

క్రీ"శే..పాలవలసవరహాలమ్మ28వ వర్థంతి....