Thursday, June 7, 2012

"అరకు" అనుభవాలు



కాశం నుంచి ధారగా కురుస్తున్న పొగమంచు. ఆ మంచులో మత్తుగా పడుకున్న కొండచిలువ లాంటి రైల్వే ట్రాక్. దారి పొడవునా ఆకాశాన్నంటినట్టుగా వుండే సిల్వర్ వోక్ చెట్లు. వాటి పక్కనే గాలికి స్లో మోషన్‍లో ఊగుతున్నట్టుగా దేవదారు కొమ్మలు. రోడ్డుకు ఇరువైపులా పచ్చటి తివాచీ పరచినట్టుగా వున్న పచ్చిక బయలు. దాని మీద అందంగా ట్రిమ్ చేసిన పొదలు. వాటి మధ్యలో అప్పుడే తలారా స్నానం చేసినట్టుగా ఉన్న క్రిస్మస్ చెట్లు. దూరంగా కొండల్లోంచి కోకిల గొంతుకు తీతువుపిట్ట స్వరం తోడయి ఎకో ఎఫెక్ట్ లో వినిపిస్తున్న 


వింత శబ్దాలు.యూకలిప్టస్ ఆకుల చిలిపి సయ్యాటలు. వాటి నుంచి వచ్చే సౌగంధానికి గమ్మత్తుగా మూసుకుపోతున్న కనురెప్పలు. దూరంగా తేయాకు తోటలనుంచి ఘుమఘుమల్ని మోసుకురావడానికి ప్రయాస పడుతున్న పిల్లతెమ్మెరలు. అక్కడక్కడా


బొమ్మరిల్లుల్లాంటి విడిదిగృహాలు.దారిపొడవునా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే మట్టిప్రతిమలు...దేవుళ్ళ విగ్రహాలు. గలగలమంటూ దూకే అందమైన జలపాతాలు. ఇవీ మంచు ముసుగును కప్పుకొని తొంగిచూస్తున్న అరవిరిసిన అరకులోయ అందచందాలు. ఇక్కడికెళ్ళిన ప్రకృతి ఆరాధకుడు మరపురాని అనుభూతులని గుండెనిండా నింపుకొని వెళ్తాడు.
అరకు వెళితే మనసు మరోలోకంలో తేలిపోతుంది. అన్నీ మరచిపోయి హాయిగా అక్కడే ఉండిపోతే ఎంతబాగుండు అనిపిస్తుంది. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటుచూసిన హరితవర్ణమే. ఆహ్లాదకరమైన వాతావరణమే. ఎత్తైన కొండలు అంబరాల అంచును చూద్దామంటాయి. గంభీరమైన లోయలు తమ లోతు కనుక్కోమంటాయి. అడుగడుగునా కొండవాగుల పలకరింతలు..కొండకోనలనే నెలవుగా మలచుకున్న గిరిజనం.. చెట్టుపుట్టలనే నమ్ముకున్న వారి జీవనాధారం.. అరకు అంటే మట్టిమనుషుల పచ్చని వాటిక. అరకు అంటే పర్యాటకుల ఆహ్లాద పేటిక. అడవితల్లికి దండాలు అనిపించే అపురూపమైన స్ధలం.


నేను అరకు సీనరీలను సినిమాల్లోనే చూడ్డం.. లేకపోతే అబ్బో అరకు అందాలు అని కళ్ళింత చేసుకొని చూసొచ్చినవాళ్ళు చెబితే చెవులింత చేసుకొని విన్నాను.ఇక ఆగలేను మొర్రో అని అరకులోయ అందాలను చూసొద్దామని బయల్దేరాం మేం ఐదుగురు మిత్రులం..



విశాఖ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోయలు రైలుమార్గంలో వెళ్ళాలంటే కిరండూల్ కొత్తవలస ట్రైన్ ఎక్కాలి. ఈ సెక్షన్లో నడిచే ఏకైక ప్రయాణీకుల రైలు అదే. ఇది రోజూ ఉదయం ఆరున్నరకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. శృంగవరపు కోటదాకా మైదాన ప్రాంతం.. అక్కడ్నుంచి ఘాటీ సెక్షన్ మొదలవుతుంది.



మన ధ్రిల్ మొదలయ్యేది కూడా ఇక్కడ్నుంచే. నిజానికి ఈ రైలు మార్గం వేసింది బైలదిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ రేవుకు తరలించేందుకు. దీనిమీదే కిరండూల్ రైలు ప్రవేశపెట్టారు. ఈస్ట్ కోస్ట్ సెక్షన్ పై ఈ రైలు కొత్తవలస దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని అరకు మార్గం పడుతుంది.అంతిమగమ్యం కిరండూల్. అందుకే దీనికి కొత్తవలస-కిరండూల్ రైలు.. లేదా షార్ట్ గా కెకె రైలు అని పేరు వచ్చింది. కొత్తవలస నుంచి బయల్దేరి రెండు స్టేషన్లు దాటాక శివలింగపురం అనే ఊరు వస్తుంది.


ఇక్కడ్నుండే రైలు కొండలెక్కడం మొదలవుతుంది. గోస్తని నది లోయ . దని చుట్టూ రక్షణ కడ్యంలా నిల్చున్న కొండలు..ఆ కొండల మీదుగా రైలు ప్రయాణం. ఎక్కడ చూస్తే అక్కడ పచ్చదనం. దారిపొడవునా స్వాగత తోరణాల్లాంటి కొండవాగులు, జలపాతాలు, రైలుకు ఎడమవైపుగా, లోయలు కుడివైపుగా వస్తాయి. రైలు ఎత్తుకు చేరుకున్నాక 


అసలు మజా ఉంటుంది.కిందకు చూస్తే అగాధంలాంటి లోయలు. పైకి చూస్తే భీకరమైన కొండలు. కొండల ఎత్తు సముద్ర మట్టానికి ఆరువందల నుంచి తొమ్మిది వందల మీటర్ల దాకా ఉంటుంది. ఈస్ట్రన్ ఘాట్స్ లో ఈ కొండలు ఓ భాగం. రైలు పాములా జరజరా పాకుతూ కొండలను చుట్టేస్తుంటే అటు ప్రకృతి.. ఇటు మానవ మేధస్సూ రెండూ అబ్బురపరుస్తాయి. దారిలో ఎనభై నాలుగు వంతెనలు, యాభై ఎనిమిది టన్నెల్స్. గాలిలో తేలుతున్నట్టుండే 



వంతెనలు, కొండలను తొలిచి నిర్మించిన టనెల్స్..వీటి గుండా ప్రయాణం.అరకు వెళ్ళే దారిలో అతిపెద్ద టనెల్ పొడవు అరకిలోమీటర్ పైనే. వంతెన తర్వాత టనెల్.. టనెల్ తర్వాత వంతెన అన్నట్టు సాగుతుంది ప్రయాణం. మధ్యలో కొండల మీదుగా దూకే ఏర్ల నుంచి తుంపరలు వంటిమీద పన్నీరులా పడి గిలిగింతలు 






పెడుతుంటాయి. దారిలో గిరిజన గ్రామాలు. కొన్ని దగ్గరగా..కొన్ని అల్లంతదూరంలో. చుట్టూ అడివి.రైలు శబ్ధం తప్ప మరో శబ్ధం వినపడదు. కళ్ళముందు పరచుకున్న పచ్చదనం. అక్కడక్కడా చిన్న వాగులు. వీటిని స్ధానికులు గెడ్డలని పిలుస్తారు. ఇలాంటివి ఎన్నున్నాయో లెక్కపెట్టడం సాధ్యంకాదు . మధ్యలో బొర్రాగుహల స్టేషన్ వస్తుంది. తర్వాత వచ్చేది సిమిలిగూడ.ఈ సెక్షన్ లో ఎత్తయిన స్టేషన్ ఇదే. రైలు మ్యాగ్జిమం ఎత్తుకు 
చేరుకునేది ఇక్కడే. తర్వాత వచ్చేది అరకు.. ద ఫైనల్ డెస్టినేషన్...