Monday, October 31, 2011

ద్వాదశజ్యోతిర్లింగాలు (2)



5. వైద్యనాధేశ్వరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధితపాదపద్మం ష్రీవైద్యనాథం తమహం నమామి ||

బీహార్ రాష్ట్రములోని, బీడ్ జిల్లాకు 26కి.మి దూరాములో, పర్లి అనే గ్రామంలో వైద్యనాధేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ గ్రామాన్నే కాంతిపూర్/మధ్యరేఖ వైజయంతి/ జయంతి అని కూడా పిలుస్తారు. కన్యాకుమరి నుండి, ఉజ్జయిని కి ఒక రేఖను గీస్తే, ఈ పర్లి గ్రామం స్పష్టంగా ఆ రేఖపై కనిపిస్తుంది. మేరు/నాగనారయణ పర్వతాల కి దగ్గర్లో ఉంది ఈ గ్రామం. బ్రహ్మ, వేణు, సరస్వతి అనే నదులు ఇక్కడ మనకు కనిపిస్తాయి.
మహా శివ భక్తుడైన రావణుడు, శివ అనుగ్రహం కోసం తపస్సు చేయసాగాడు. ఎండనక, వాననక సంవత్సరాలు తరబడి తపస్సు చేసినా ఆ భోళా శంకరుడు అనుగ్రహించలేదు. రావణుడు తన తలను శివునికి అర్పించాడు. ఆ సమయంలో భక్తవ శంకరుడు అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, దానికి రావణు డు, "నిన్నే నా లంకకు తీసుకొని వెళ్ళి అక్కడ పూజించుకుంటాను, ఆ వరం ప్రసాదించు" అని కోరాడు. దానికి శివుడు, "నేను ప్రసాదించే లింగాన్ని నువ్వు తీసుకొనివెళ్ళు, ఎట్టి పరిస్థితులలో మధ్యలో కింద పెట్టవద్దు" అని హెచ్చరించాడు. శివ ప్రసాదంతో బయలుదేరిన రావణు డు, మర్గమద్యలో నదీ తీరంలో సంధ్యావందనం చేయతలచి, దగ్గర్లో ఓ బాలుడుని పిలిచి, తాను వచ్చేవరకు లింగాన్ని కింద పెట్టవద్దన్ని చెప్పి వెళ్ళాడు. రావణుడు అటు వెళ్ళగానే, ఆ బాలుడు రెండుసార్లు రావణుడిని పిలిచి, అతను రాకపోయేసరికి లింగాన్ని కిందపెట్టేసాడు. ఆ లింగమే వైద్యనాధేశ్వర లింగం. ఆ బాలుడేవరో కాదు, గణాధీశుడు.
ఇంకో కథనం ప్రకారం. సాగరమధనంలో శ్రీమహావిష్ణువు అమృతమును, ధన్వంతరిని శివలింగంలో దాచాడు. ఆ లింగాన్ని తాకిన అసురులు, లింగం నుండి వెలువడే మంటల తాకిడికి తాళలేక పోయారు. అదే శివభక్తులు తసకితే లింగం నుండి అమృతం కురవ సాగింది. అందుకే ఈ లింగానికి వైద్యనాధేశ్వర లింగం/అమృతేశ్వర లింగమని పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు లింగాన్ని త్రాకి భక్తితో పూజించుకుంటారు.

6. భీమశంకరుడు
యం ఢాకినిశాకినికాసమాజె నిషేవ్యమాణం పిషితాషనైష్చ |
సదైవ భీమాదిపదప్రసిద్దం తం షణ్కరం భక్తహితం నమామి

మహారాష్ట్రంలో పూనె పట్టణానికి కొద్ది దూరంలో భీమానది తీరాన సహ్యాద్రి పర్వత శ్రేణిలో డాకినీ అనే అరణ్యంలో  భీమశంకరుడు వెలిసాడు. త్రిపురాసురుడి ఆగడాలను అరికట్టడానికి శివుడూ రుద్రావతారుడైనాడు. శివునితో యుద్ధానికి పాల్పడిన త్రిపురాసురుడు, శివునిచే సం హరించబడ్డాడు. యుద్ధం చేసి అలసిన శంకరుడు ఎత్తైన సహ్యాద్రి పర్వతాలపైన విశ్రమించాడు. శివుని శరీరం నుండి స్వేద బిందువుల ధారే చిన్న కొలనుగా ఏర్పడింది. అక్కడనుండే భీమానది ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి. 

మరో కథనం ప్రకారం, పూర్వము కామరూప రాజ్యం నందలి "ఢాకినీ" అను ప్రదేశములో భీమాసురుడు అను రాక్షసుడు 
ఉండేవాడు. తన తల్లి కోరికపై బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసి, అనేక వరాలు పొంది, దేవేంద్రాదులను జయించాడు. భీమాసురుడు కామరూప రాజ్యముపై దండెత్తి, కామరూప రాజు సురక్షణను, అతని భార్య సురణాదేవిని బంధించెను. సురక్షణ, సురణాదేవి శివ భక్తులైనందున, వారు చెరశాలలో పార్ధివ లింగమును పూజించు చుండిరి. భీమాసురుడు శైవుడైనందు వలన రాజదంపతులను పరమేశ్వరుని సేవింపరాదని శాసించాడు. ఆ రాజదంపతులు భీమాసురునకు భయపడక, పరమేశ్వరుడిని పూజించిరి. భీమాసురుడు రాజ దంపతులను సంహరించుటకు తన కత్తిని ఎత్తాడు. అంతట పరమేశ్వరుడు ఆ మట్టి లింగము నుండి వచ్చి, భీమసురుడును సంహరించెను. రాజ దంపతులు పూజించిన ఆ లింగమును భీమశంకర లింగము అంటారు. 

7. రామేశ్వరుడు 

తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో రామేశ్వం వుంది. శ్రీరాముడు స్థాపించడంవలన ఇది రామేశ్వరమైంది. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైంది. ఈ క్షేత్ర మహిమను స్కందపురాణం, రామాయణం, రామచరితమానస్, శివపురాణం మొదలగు గ్రంథాలుచె ప్తున్నాయ. లంకపైకి యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడు ఇక్కడే శివపూజ చేసి ఆశీర్వాదం పొందాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు సీతతో కలిసి ఇక్కడ పూజలు నిర్వహించాడు. హనుమంతుడు కైలాసంనుండి తెచ్చిన శివలింగం ఇక్కడే ప్రతిష్టితమైంది. లంకకు వెళ్లే వారధిని విభీషణునికి కోరిక మేరకు శ్రీరాముడు తన ధనస్సుతో ఛిన్నాభిన్నం చేసాడు. ఇదే స్థలంలో "ధనుష్కోటి" తీర్థం ఇప్పుడు జనులను ఆకర్షిస్తోంది. మహా శివరాత్రిలాంటిపర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. లక్ష్మణశిల, పంచముఖి హనుమాన్, శ్రీరామ-జానకీ మందిరాలు ఇక్కడ నెలవైయున్నాయ. గుడికి దగ్గరలో వున్న సముద్ర ప్రాంతంను అగ్ని తీర్ధము అంటారు. ఇక్కడ స్నానము చేసిన తర్వాతనే గుడికి వెళ్ళాలి. భారతదేశములో నాలుగు మూలల వున్న నాలుగు దామాలలో మొదటిది రామేశ్వరం. మిగతావి ద్వారక, పురీ జగన్నాధ్, బదరీనాధ్. 

8. నాగేశ్వరుడు 

గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14కి. మీ దూరము) చాలా చిన్న గ్రామం.
దారుకావనమున తారకాసురుడు తన పరివారముతో నివసించి , ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నారు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారమున ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చెయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురుడుకు చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసరుడు కోపామును పట్టలేక తన చేతిలోని గదచె సుప్రియుని తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరుపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది. 

ఈ గుడి నిర్మాణ తీరు వర్ణనాతీతం. పాండవకాలంలో చేసిన రాతి కట్టడం. నాలుగు స్థంబాల మీద నిర్మించిన ఈ గుడిలో, నాగేశ్వరుడు గర్భ గుడిలో పూజలందుకుంటాడు. ఇక్కడ చెప్పదగ్గ విశేషం ఎంటి అంటే, నందీశ్వరుడు మనకు శివునికి ఎదురుగా కనిపించడు. ఈ గుడి వెనుక వైపు నందీశ్వరునికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ గుడికి చుట్టూరా 12జ్యోతిర్లింగాలను, 12దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు.

Friday, October 21, 2011

దక్షిణామూర్తి కథ


చిత్రంలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహాన్ని గమనించారా? ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.
 
బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైనజ్ఞానా
న్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు.  శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

Sunday, October 16, 2011

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి...


విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి...
విజయీభవ..!

నవరాత్రి పూజను తొమ్మిది రోజులపాటు చేయాలి. తొమ్మిది రోజులు చేయలేనివారు ఐదురోజులు, ఐదురోజులు చేయలేనివారు మూడు రోజులు, మూడు రోజులు కూడా చేయలేనివారు కనీసం ఒక్కరోజయినా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్తవ్రచనం. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.

విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ పని, వృత్తి, వ్యాపారం అయినా అఖండ విజయం సాధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం!
నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం - అమ్మవారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారంచేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గా’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి.

మహాగౌరి : అనితర సాధ్యమైన తపస్సు ద్వారా నల్లని తన మేని ఛాయను మార్చుకుని ధవళ కాంతులతో ప్రకాశించిన దుర్గాదేవి స్వరూపం మహాగౌరి. ఈమె ఉపాసన సద్యఃఫలదాయకమై, భవిష్యత్తులో సైతం పాపచింతనలు దరిచేయనీయదు. అసంభవాలైన కార్యాలు సాధించడానికి ఈ తల్లి అనుగ్రహం ఎంతో అవసరం.
సిద్ధిదాత్రి: అష్ట సిద్ధులతోపాటు మోక్షసిద్ధిని కలిగించే అమ్మరూపం ‘సిద్ధిద’. లౌకిక, అలౌకిక సర్వార్థ సిద్ధులకు ఈమెను అధిష్టాన దేవతగా శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సర్వకార్య సాధక స్వరూపం సిద్ధిద. పరమ శివుని అర్ధభాగంగా ఉన్న ఈమె చతుర్భుజాలతో భక్తుల పూజలందుకుంటుంది. ఈమె కమలాసన. మరొక కమలాన్ని చేతిలో ధరించి ఉంటుంది. ఈమెను నిష్ఠతో ఆరాధించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకుంటారు.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఆదిశక్తిని వివిధ రూపాలతో, నామాలతో అర్చిస్తారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాలలో జీవితాన్ని సుఖశాంతిమయం చేసుకునే రాత్రులే నవరాత్రులు. నవరాత్రులలోని మొదటి మూడు రాత్రులు దుర్గగా, తర్వాతి మూడురాత్రులు లక్ష్మిగా, చివరి మూడు రాత్రులు సరస్వతిగా శక్తిస్వరూపిణి అయిన అమ్మ ఆరాధనలు అందుకుంటుంది. 
పదవ రోజున నవరాత్రి పూజలకు స్వస్తిచెబుతూ విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో శరన్నవరాత్రోత్సవాలలో శ్రీరాముని ఆరాధన కూడా జరుగుతుంటుంది. 

విజయానికి నాంది ఈ దశమి
నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించి శక్తి పుంజుకున్న మానవుడు విజయం కోసం ఉవ్విళ్లూరడం సహజం. ఎందుకంటే దసరా పండుగ అందరికీ విజయాలను చేకూర్చే పండుగ. ఎందరో రాజులు విజయ దశమిని విజయప్రాప్తి దినంగా ఎన్నుకున్నట్లు చరిత్ర చెబుతోంది శ్రీరాముని పాలనాకాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీ రాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడు. ఛత్రపతి శివాజీ మొగలాయి రాజు ఔరంగజేబును ఎదుర్కొనడానికి విజయదశమినే ముహూర్తంగా ఎంచుకుని, అదేరోజున యుద్ధం చేసి, అఖండ విజయం సాధించాడు. 

ఆశ్వయుజమాసంలో విజయవాడలోనూ తిరుమలలోనూ జరిగే బ్రహ్మోత్సవాల సందడి యావద్భారతదేశానికీ కన్నుల పండువ చేస్తుంది. ఈ మహోత్సవాల సంబరాన్ని తిలకించాలంటే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి తీరవలసిందే. ఈ పదిరోజులూ చేసే పూజలూ అలాంకారాలతో అమ్మ నూతన తేజస్సును సంతరించుకుని మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

కారణజన్మురాలయిన దుర్గమ్మ త్రిమూర్తుల తేజస్సుతో, త్రిమూర్తుల తే జస్సుతో, ముక్కోటి దేవతల శక్తులనూ పుణికిపుచ్చుకుని మహిషారుడనే లోకకంటకుడయిన రాక్షసుని సంహరించి విజయాన్ని చేజిక్కించుకుంది. 

కౌమారీ పూజ
నవరాత్రులలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క దేవతను పూజించే విధానం దేవీభాగవతంలో ఉంది. దీని ప్రకారం కన్నెపిల్లలను లేదా రజస్వల కాని బాలికలను మంత్రోక్త విధానంలో దేవతావాహనం చేసి పూజిస్తారు. 
తొలిరోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు రెండేళ్ల వయసున్న బాలికను పూజిస్తారు. అది మొదలు నవరాత్రులు ముగిసేవరకు బాలికలను ఇంటికి తీసుకొచ్చి వారిలో నవదుర్గలను ఆవాహన చేసి షోడశోపచారాలతో సర్వాలంకార శోభాయమానంగా పూజిస్తారు. 

శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్ర్తాలను జమ్మిచెట్టుపైనే దాచారు. 

మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల భక్తులకు సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. 

శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. 

దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుకు కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రాంతంలో దసరాకు చేసే బతుకమ్మ పండుగ ప్రఖ్యాతమైంది. విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. 

ఈ విజయదశమి అందరికీ అన్ని రంగాలలోనూ విజయాలను చేకూర్చాలని ఆదిపరాశక్తిని ప్రార్థిద్దాం!